Sunday, May 24, 2009

వీటిని విడిచి పెట్టాలి

లోకంలో మనిషి కొన్నింటిని ప్రోది చేసుకొవాలి, కొన్నింటిని వదులుకొవాలి. వేటిని ఎదలొ పదిలపరచుకోవాలొ, వేటిని ఎడగా నెట్టివేయాలొ మనిషి తెలుసుకొవాలి. ఇదే వివేకం. ఈ వివేకముంటే మనిషి మనిషిగా మనగలుగుతాడు, మన్ననా పొందగలుగుతాడు. ఆ విడనాడవల్సినవేమిటొ వినండి.

ఆలస్యం త్యక్తవ్యం

లౌల్యం లోభః పరాపవాదశ్చ

అస్ధానేషు చ కోపః

తధాతిమానశ్చ పురుషేణ


సొమరితనం, చాపల్యం, దురాశ, పరనింద, అనువుకాని కొపం, దురహంకారం ఈ ఆరింటినీ మనిషి వదులుకోవాలి.
మనిషికి వైయక్తికంగానూ, సామజికంగానూ కొన్ని కర్తవ్యాలున్నాయి. అల్లాగే భౌతికంగానూ, పారమార్ధికంగానూ కొన్నివిధులున్నాయి. ఏ రకంగా చూసినా కొన్ని కృత్యాలున్నాయి, కొన్ని అకృత్యాలున్నాయి. ఇవన్నీ ఎరిగి సకల విధాలకర్తవ్యాలు నిర్వహించి అకృత్యాలు విసర్జించినవాడే కృతకృత్యుడౌతాడు. వాని మానవజన్మ చరితార్ధమౌతుంది.
ఎందులొ ప్రవర్తించాలన్నా త్యాజాలు ఉంటాయి. కొన్ని ఉపాదేయాలూ వుంటాయి. ముందు త్యాజాలు తెలుసుకోవాలి. వాటిని విడిచి పెట్టాలి. అప్పుడు ఉపాదేయాలవైపు మనసు అనుకూలంగా ప్రసరిస్తుంది. వాటిని స్వీకరిస్తుంది.
అంచేత ఏ దృష్టితో కానీ మనిషి వదులుకు తీరాల్సినవి ఆరున్నాయి. వాటిని తెలుసుకొని వదులుకొనే ప్రయత్నం చేయండి అంటున్నాడు నీతికారుడు.
వాటిలొ మొదటిది ఆలస్యం
తెలుగువారి ఆలస్యంకాదు. సంస్కృతం ఈ ఆలస్యం. ఆలస్యం అంటే సోమరితనం. ఇది కనపబడకుండా చాపకింద నీరులా మనిషిని ఎదగకుండా లోతులకు తొక్కేస్తుంది. ఈ సొమరితనం మనిషికి లభించిన మహత్తరమైన కాలాన్ని కబళిస్తుంది. ప్రతీదీ "తరువాత" "తరువాత" అనిపింప చేస్తుంది. "తరువాత" అన్నాడంటే "ఇహ సరి" అన్నమాటే.
పశ్చాచ్ఛబ్దొ నాస్తి పర్యాయః అని సంస్కృతంలొ ఓ ఆభాణకం వుంది. ఈ సోమరితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. కర్తవ్యం పట్ల ఉదాసీనుణ్ణి చేస్తుంది. దాంతొ కర్తవ్యం కాస్తా కాలదొషం పట్టిపోయి కాలగర్భంలొ కలసిపోతుంది. చెయ్యాల్సినవి చెయ్యక జీవితమంతా వ్యర్ధంగా గడిపేసి ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన మానవ జన్మను సదుపయోగపరచుకోలేక మనిషి భ్రష్టుపట్టిపోతాడు. అంచేత, 'రేపన్నది నేడు, నేడన్నది ఇప్పుడు' అన్నట్లు మనిషి వుండాలంటే ఆలస్యాన్ని దవ్వులకు తొలాలి.
రెండొది లౌల్యం
అంటే చాపల్యం. మనిషికి వుండే చాపల్యం ఇంతా అంతా కాదు. ఈ చాపల్యామూ ఎన్నొ రకాలు. ప్రతి ఇంద్రియానికీ ఒక్కొ రకం చాపల్యం. సరేసరి. మనసు మరీ చపలం. ఈ చాపల్యం వల్ల భావధార్ధ్యం, ఆశయస్థైర్యం సడలిపోతాయి. లక్ష్యసాధనకు ఇది భంజకం కనుక చాపల్యాన్ని వదులుకోవాలి.
మూడోది లోభం - దురాశ
మనిషికి ఆశ ఉండవచ్చు. ఉండాలి కూడాను. చదువుకోవాలని ఆశ, సంపాదించాలని ఆశ. సత్కృతులాచరించాలని ఆశ, ఇల్లా ఎన్ని ఆశలైనా ఉండొచ్చు. తప్పు కాదు. కాని, దురాశమట్టుకు కూడదు. అత్యాశకంటేనూ చెడ్డది ఈ దురాశ.
ఎత్తులకు ఎదగాలనుకోవడం ఆశ.
అందరాని ఎత్తులకు ఎదగాలను కోవడం అత్యాశ.
అందరాని ఎత్తులకు ఎగరాలను కోవడం దురాశ.
ఇది మనిషిని లోతులను పాతేస్తుంది. దురాశ దుఃఖానికి చేటు కదా! అంచేత దీన్ని వదులు కోవాలి.
తరువాతది పరనింద
కొందరికి ఒరులను నిందించడమే జీవితాశయం. లేచింది మొదలు పడుకునే వరకు ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవడమే వీరిపని. ఇది మంచిదికాదు. చెదలు కొరికినట్లు లొపల్లొపల ఇది వీణ్ణి తినేస్తుంది. పరనింద వల్ల వీడికొచ్చేది ఏమీ లేదు. మనస్సు అపమార్గంలోనే నడవడానికి అలవాటు పడి పోతుంది. కడకు వీడి బతుకు పెడ తొవనే పడుతుంది. ఈ స్వభావమువల్ల వీడు తన నాశాన్ని తానే తెచ్చుకున్న వాడౌతాడు. కనుక దీన్ని వదులు కోవాలి.
అస్థానకోపం ఐదోది
అనువుకాని వేళ కొపం పనికి రాదు. అనువుకాని వ్యక్తులపై కోపం పనికిరాదు. కోపానికి సమయా సమయాలుంటాయి. తప్పుచేసెడు-కొపం వచ్చింది. ఇక్కట్టుల్లొ ఉన్నాడు, అక్కడ అప్పుడు కొపం చూపరాదు.
ఎవరో ఒకపెద్దాయన మీద పట్టరాని కోపం వచ్చింది. ప్రయొజనం? పేదవాడి కోపం పెదవికిచేటు. వీడు పేద, అన్ని రకాలుగాను కొపం వచ్చింది. కాని, అవతల ఆ కోపం ప్రదర్శించే వీలులేదు. చోటుకాదు. కాని, కొపం ఉండనీయటం లేదు. శివజటాజూటంలొ సుడులు తిరుగు తున్న వియద్గంగలా ఎగిసి ఎగిసి పడుతుంది. దాన్ని ఎంత సేపు బిగపడతావు? నీకు లొంగి ఎంతసేపు పడి ఉంటుంది? నీ పెదవిని కాటువేస్తుంది. గాటు చేస్తుంది. సరి దాని పని. ఏమొరిగింది నీకు? ఆ కొపమెందుకు నీకు? అంచేత అనువుకాని కొపం పనికి రాదు. దాన్ని వదిలెయ్.
చివరిది దురహంకారం
అహంకారమే చెడ్డదంటారు. తనమీద అతివిశ్వాసం అహంకారం, తనమీద అతివిశ్వాసంతొపాటు అవలివారిపై ఎల్లిదపు చూపు దురహంకారం. నువ్వు చెయ్యగలననుకుంటే చేసుకో. కాని, ఆ అనుకోవడంలొ అవతలి వారిని కించ పరచకూడదు. ఇది సుతరామూ మంచిదికాదు.ఏం? వాడు మట్టుకు చేయ్యలేడా? నేను చెయ్యగల ననుకో, ఎదిరి చెయ్యగలడా లేడా అన్న పరామర్శ నువ్వు పెట్టుకోకు. అది నీకు కానిది.
ఇట్లా ఈ ఆరూ మనిషిని ఎత్తుల నుండి లోతుల పడవేసేవి కనుక బుద్దిమంతుడు తప్పక వీటిని వదులుకోవాలి.