Monday, July 26, 2010

ఢిల్లీ-బదరి యాత్ర వివరాలు

మొదటి రోజు
ఉదయం మూడున్నరకి నిద్ర లేచి అందరం తయారు అయి హైదరాబాదు ఎయిర్ పోర్టుకు బయలుదేరాము. మమ్మల్ని ఎయిర్ పోర్టులో దించటానికి నాన్నగారు వచ్చారు. కారులొ పాతబస్తి మీదగా ప్రయాణించి బెంగళూరు రహదారి ఎక్కాము. ఈ రోడ్డు ఎయిర్ పోర్టుకు వెళ్ళే రొడ్లలొ ఒక దారి. పాతబస్తి ప్రాంతంలొ రోడ్డు బాగా పాడయి అక్కడ ప్రయాణం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సగం దూరం వెళ్ళిన తరువాత ఎయిర్ పోర్టు చేరేవరకు రొడ్డు చక్కగా వుంది. హైదరాబాదు ఎయిర్ పోర్టు చాలా విషయాల్లొ సౌకర్యంగా అనిపించింది. ఎయిర్ పోర్టు లొపల బయట పరిసరాలన్ని చాలా శుభ్రంగా వుంచారు. ఎయిర్ పోర్టు లోపల ప్రదేశం అంతా విశాలంగా అనిపిస్తుంది. అక్కడ ఎక్కువ కౌంటర్లు వుండటం వలన మాకు చెక్-ఇన్ తొందరగా అయింది. సెక్యూరిటీ చెక్ దగ్గర కొంత ఎక్కువ సమయం పట్టింది. అక్కడ నుంచి ఎయిర్ ఇండియా విమానంలొ మేము ఢిల్లీ చేరాము. రెండు గంటల ప్రయాణం. రైల్లొ వెళితే ఒక రోజు పడుతుందట. ఇండియాలొ కూడ దూర ప్రయాణాలు చేయటానికి విమాన ప్రయాణం ఒక మంచి సాధనం అనిపించింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి మమ్మల్ని బదరీనాధ్ తీసుకొని వెళ్ళటానికి సదరన్ ట్రావెల్సు వారి కారు వచ్చింది. డ్రైవర్ పేరు జస్వింధర్ సింగ్. ఢిల్లీలొ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా అనిపించినప్పటికి అక్కడి రోడ్లు బావున్నాయి. ఘాజియాబాద్, మీరట్, ముజఫర్ నగర్, రూర్కీ మీదగా హరిద్వార్ చేరాము. వెళ్ళే దారిలొ చాలా చెరకు పొలాలు, మామిడి తొటలు కనిపించాయి. మధ్యలో పంజాబీ ధాభా దగ్గర ఆగి భొజనం చేసాము. సాయంత్రం సుమారు అయిదు గంటలకి హరిద్వార్ చేరాము.

అక్కడ గంగానది ఘాట్ దగ్గరికి వెళ్ళి తల మీద నీళ్ళు పోసుకొని కొంత సేపు ఆ ప్రాంతంలో గడిపాము. అక్కడ స్నానాలు చేయటనికి చాలా మంది వచ్చారు. అక్కడ నదిలొ చాలా నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రాంతంలొ వచ్చే యాత్రికుల కోసము అక్కడ సౌకర్యాలు అంత బాగా లేవు. తడిసిన బట్టలు మార్చుకొవటానికి అక్కడ విడిగా ఏమి సౌకర్యాలు కనిపించలేదు. బాత్రూములు కూడ అంత శుభ్రంగా అనిపించలేదు. తరువాత మేము అక్కడ నించి బయలుదేరి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలొ వున్న ఋషికేష్ కి వెళ్ళాము. ఢిల్లి నుంచి ఋషికేష్ చేరటానికి మేము దాదాపు 225 కిలోమీటర్ల ప్రయాణం చేసాము. అక్కడ హోటల్ తీసుకొని అందరం స్నానాలు చేసి రామ్ జూలా బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాము. రాత్రి చీకటిగా వుండటం వలన అక్కడ పెద్దగా ఏమి కనిపించలేదు. బ్రిడ్జి మీద కొంత దూరం వెళ్ళీ వెనక్కి వచ్చేసాము. వచ్చే దారిలొ వున్న మద్రాసు హొటల్లొ భోజనం చేసి వచ్చి హొటల్లొ పడుకొన్నాము.

రెండవ రోజు
నేను మరుసటి రోజు ఉదయం స్నానం చేసి ఋషికేష్ లోని గంగాతీరం ఘాట్ వద్దకు వెళ్ళాను. అప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా వుంది. అక్కడ నుంచి రామ్ జూలా బ్రిడ్జి కనిపిస్తుంది.

తీరం పొడవునా వున్న ఘాట్ మెట్లు మీద కొంత మంది వాకింగ్ చేస్తూ కనిపించారు. నేను కొంతసేపు అయిన తరువాత రూముకి వచ్చి అందరితో కలసి మళ్ళీ తీరానికి వెళ్ళాను. అక్కడ కొంత సమయం వుండి కొన్ని ఫోటొలు దిగి మళ్ళీ రూముకి చేరాము. ఏడు గంటలకి కారులో అన్నీ సర్దుకొని బదరి ప్రయాణం అయ్యాము. అక్కడ నుంచి అంతా ఎత్తైన పర్వతాల మీద వున్న ఘాట్ రొడ్డులొ సుమారు 300 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. దారి పొడువునా ఆ పర్వతాల మధ్య వున్న లొయలో గంగా లేక అలకనందా నది ప్రవహిస్తూ వుంటాయి. దారిలొ కొన్ని చొట్ల రొడ్డు బాగా పాడైయింది. రోడ్డు మలుపుల వద్ద వాహనాలని చాల జాగ్రత్తగా నడపాలి. ఎదురు నుంచి వచ్చే వాహనాలు అంత బాగా కనిపించవు. డ్రైవర్ కారును వేగంగా నడుపుతూ తీసుకు వెళ్ళాడు. దారిలొ దేవ ప్రయాగ వద్ద ఆగాము.

ఆ ప్రదేశంలొ అలకనందా నది భగీరధి నది సంగమం జరిగి అక్కడ నుంచి దానిని గంగా నది అని పిలవబడుతుంది. అలకనందా నది హిమాలయాలలొ ప్రారంభం అయి బదరినాధ్ మీదుగా క్రిందకి వస్తుంది. వేసవి కాలంలొ మంచు ఎక్కువగా కరగటం వలన నదిలో నీటి ప్రవహం ఎక్కువగా వుంటుంది. భగీరధి నది హిమాలయాలలోని గొముఖ వద్ద ప్రారంభం అయి క్రిందకి వస్తుంది. దేవ ప్రయాగ ఒక దివ్య దేశం. అక్కడ పురుషొత్తమ పెరుమాళ్(రాముడు) గుడి వుంది. ప్రయాగ అంటే రెండు నదుల కలిసే చోటు. బదరి వెళ్ళే దారిలొ కర్ణ ప్రయగ, రుద్ర ప్రయాగ, నంద ప్రయాగ, విష్ణు ప్రయాగ వంటి ప్రదేశాలలొ వేరే కొన్ని నదులు అలకనందా నదిలో కలుస్తాయి. మేము కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత పీపలకోట వద్ద భొజనానికి ఆగాము. అక్కడ భొజనంలొ రొట్టెలు, అన్నం పెట్టారు. అక్కడ నుంచి బయలు దేరిన తరువాత అలకనందా నది మీద కొత్తగా నిర్మిస్తున్న కొన్ని హైడ్రో పవర్ ప్రాజెక్టులు కనిపించాయి. ఉత్తరఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత అక్కడ ప్రభుత్వ ప్రోత్సాహంతో వీటి నిర్మాణం చేపట్టారట. వీటిలొ కొన్నింటిని జివికె లాంటి ఆంధ్రా కంపెనీలు నిర్మిస్తున్నాయి. దారిలో వున్న ఎతైన పర్వతాల మీద కొన్ని చోట్ల జన నివాసం కూడ వుంది. ఆ కొండల మీద కొన్ని చోట్ల పంటలు కూడ పండిస్తున్నారు. అక్కడ రైతులు నీటి కోసం పూర్తిగా వర్షం మీదనే ఆధార పడతారట. మేము వెళ్ళే దారిలొ మోటర్ బైక్స్ మీద వెళుతూ చాలా మంది పంజాభీయులు కనిపించారు. వాళ్ళందరూ గురుగోబింద్ సింగ్ అనే గురువు కొన్ని సంవత్సరాలు వుండి తపస్సు చేసుకొన్న ప్రాంతం హేమకుండ్ కి వెళుతున్నారు. అక్కడికి చేరటానికి కాలినడకన రోడ్డు నుంచి పద్దెనిమిది కిలొమీటర్లు ప్రయాణం చేయాలి. వెళ్ళి రావటానికి రెండు రోజులు పడుతుందట. మేము చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత జోషిమట్ బారియర్ దగ్గర ఆగవలసి వచ్చింది. అక్కడ నుంచి అంతా సింగిల్ రొడ్డు ప్రయాణం. వాహనాలను ఒక వైపు నుంచి పంపిచ్చి ఇంకో వైపు ఆపి వేస్తారు. మేము ఒక గంట తరువాత బయలు దేరి, కొంత దూరం ప్రయాణం చెసిన తరువాత పాండుకేశ్వర్ లొ వున్న రెండవ బారియర్ వద్ద మళ్ళి ఆపారు. అక్కడ నుంచి బయలుదేరిన తరువాత రోడ్డు అసలు బాగొ లేదు. కొన్ని చోట్ల రోడ్డు మీద రాళ్ళు మాత్రమే వున్నాయి. మరి కొన్ని చోట్ల చిన్న జలపాతాల నుంచి నీరు రోడ్డు మీదకి ప్రవహిస్తుంది. ఇక్కడ వర్షం పడినప్పుడు ఒక్కొసారి రాళ్ళు, మట్టి పెళలు కొండల మీద నుంచి జారి రోడ్డు మీదకు పడి ప్రమాదాలు జరుగుతాయట. మేము వెళుతున్న కారు కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక చోట మట్టిలొ ఆగి పోయింది. అందరం కారులొ నుంచి దిగిన తరువాత కొంత సేపటికి అది ముందుకు కదిలింది. కారు డ్రైవరుకి అనుమానం వచ్చి మమ్మల్ని ఇంకో కారులొకి ఎక్కించి మా వెనకాల నెమ్మదిగా వచ్చాడు. రాత్రి పూట ప్రయాణం మరియు రోడ్డు సరిగ్గా లేక పోవటం వలన అక్కడ వాహనాలని చాలా జాగ్రత్తగా నడప వలసి వుంటుంది. చివరికి రాత్రి ఎనిమిదినర్ర ప్రాంతంలొ బదరీకి చేరేసరికి అక్కడ వాతావరణం బాగా చల్లగా వుంది. అక్కడకి చేరిన తరువాత హోటల్లొ ఒక గది తీసుకొన్నాము.

మూడవ రోజు
నేను ఉదయం లేచి స్నానం చేసి జీయర్ అష్టాక్షరీ క్షేత్రంకి వెళ్ళాను. ఈ క్షేత్రాన్ని 1959 లో పెద్ద జీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించటం మొదలు పెట్టారు. అక్కడకి వచ్చే యాత్రికుల వసతి కోసం దాదాపు ముప్పైఅయిదు గదులు వున్నాయి. ఈ క్షేత్రంలొ రోజు అన్నదానం చేస్తారు. బదరిలో నిత్య అన్నదానం ఈ ఒక్క ఆశ్రమంలోనే చేస్తారట. ఈ క్షేత్రానికి రోజూ దాదాపు వంద మంది యాత్రికులు వచ్చి వుండి వెళుతుంటారట. ఇక్కడ రోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల పాటు వచ్చిన వారందరికి భోజనాలు పెడతారు. రాత్రి పూట కూడ యాత్రికుల కొసం ఏదైనా ఫలహారం పెడతారు. ఈ క్షేత్రంలో ఉన్న గుడిలో రోజు భగవన్నామ స్మరణం మరియు ఇతర సేవలు జరుగుతాయి. నేను అక్కడ కొంత సమయం గడిపి తిరిగి హోటల్ కి చేరాను. అక్కడ నుంచి అందరం కలసి ఏడు గంటల ప్రాంతంలొ గుడికి బయలు దేరి వెళ్ళాము.

గుడి ప్రక్కనే అలకనందా నది ప్రవహిస్తుంటుంది. గుడి ప్రక్కనే వున్న తప్త కుండంలో అందరూ స్నానం చేసి లొపలికి వెళుతున్నారు. అప్పటికే అక్కడ చాల మంది భక్తులు వచ్చి దర్శనం కొసం లైనులో వేచి వున్నారు. బదరికాశ్రమం సముద్రమట్టానికి దాదాపు 10,500 అడుగుల ఎత్తులో వుండటం వలన అక్కడ వాతావరణం బాగా చలిగా వుంటుంది. సంవత్సరంలో ఆరు మాసాలు మాత్రమే ఈ గుడి తెరచి వుంటుంది. గుడిని మే మాసంలొ తెరచి మళ్ళీ నవంబర్ మాసంలొ మూసి వేస్తారు. మానవ జాతికి ప్రధానమైన జ్ఞానమానే సాధనాన్ని ఎలా వినియోగించుకుంటూ సుఖంగ బ్రతుకవలెనో తరించవలెనో తెలుపుటకై సకల శాస్త్రసారమైన, మంత్రబ్రహ్మము, మంత్రరాజము అని కీర్తించబడిన శ్రీమదష్టాక్షరీ మహామంత్రాన్ని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు లోకానికి అందించిన సుప్రసిద్దమైన పవిత్ర భూమి బదరికాశ్రమము. తానే గురువై ఆచార్య లక్షణములు తెలిపి, తానే శిష్యుడై శిష్యలక్షణములు లోకానికి తెలియుటకై స్వయముగా భగవానుడు ఆవిర్భవించిన చోటు ఇది. ఎందరికందించినా మంత్రశక్తి, తరగకుండుటకై నారాయణ, నరులుగ, పర్వతకారులై నేటికీ వారిరువురూ ఇక్కడ తపస్సు చేస్తుంటారు. ఈ నర, నారాయణ పర్వతాల మధ్యలోనే బదరీ నారాయణుని గుడి వుంటుంది.

మాకు దేవుని దర్శనానికి దాదాపు 3-4 గంటలు సమయం పట్టింది. దర్శన సమయంలో చాలా మంది భక్తులు వుండటం వలన అక్కడ కొంత తోపులాట జరిగింది. దేవుని దర్శనం అయిన తరువాత మేము నెమ్మదిగా బయలు దేరి అష్టాక్షరీ క్షేత్రానికి వెళ్ళాము. అప్పుడు అక్కడ వున్న కొంత మంది తెలుగు వాలంటీర్లు మమ్మల్ని పలకరించారు. మేము మధ్యాహ్నం అక్కడే భొజనం చేసి నెమ్మదిగా హొటల్ కి చేరాము. అనిత, ప్రణవ్ కొంత అలసి పొయి వుండటం వలన వారు గదిలో విశ్రాంతి తీసుకొన్నారు. నేను డ్రైవర్ ని తీసుకొని అక్కడ దగ్గరలొ వున్న మానా అనే ఊరికి వెళ్ళాను. అది భారత-టిబెట్ దేశాల సరిహద్దులొ ఉన్న ఆఖరి ఊరు. ఈ ప్రాంతంలొనే సరస్వతి నది అలకనందా నదిలోకి సంగమం అవుతుంది. మానా దాటగానే ఒక కొండ గుట్టపై శ్రీ వేదవ్యాసుడు కూర్చుని ఉన్న గుహ వుంది. ఈ గుహ లొనే వ్యాస మహర్షి భారతం మరియు ఇతర పురాణలు చెప్పినట్టు ప్రతీక. వ్యాస గుహనుండి సరస్వతినది దాక వెడితే ఆ నది దాటడానికి రెండు కొండలను కలుపుతూ వంతెనవలె ఒకే పెద్ద శిల వుంటుంది. దానిని భీమశిల అంటారు. స్వర్గారోహణచేస్తూ పాండవులు యిదే దారిన వెళ్ళినప్పుడు భీముడు దీనిని వేసాడని అంటారు. అవన్ని చూసుకొని నేను సాయంత్రం నాలుగు గంటలకి హోటల్ కు చేరాను. మళ్ళీ అందరం కలసి తిరిగి అష్టాక్షరీ క్షేత్రానికి వెళ్ళాము. అక్కడ సాయంత్రం గుడిలో భగవధారధన కార్యక్రమంలో పాల్గొని అక్కడ వుండే వారిని పలకరిస్తూ కొంత సేపు గడిపాము. ఈ క్షేత్రంలొ ఆరు మాసాలు దాదాపు ఇరవై మంది వాలంటీర్లు వుండి భగవత్సేవ చేసుకొంటూ ఇక్కడికి వచ్చే యాత్రికులకు భొజన, వసతి ఏర్పాట్లు చూస్తు వుంటారు. వీరిలొ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన వారే ఎక్కువ. మేము ఆ రాత్రి అక్కడే ఫలహారం తీసుకొని నెమ్మదిగా హొటల్ కు చేరి విశ్రాంతి తీసుకొన్నాము.

సశేషం..

Sunday, May 24, 2009

వీటిని విడిచి పెట్టాలి

లోకంలో మనిషి కొన్నింటిని ప్రోది చేసుకొవాలి, కొన్నింటిని వదులుకొవాలి. వేటిని ఎదలొ పదిలపరచుకోవాలొ, వేటిని ఎడగా నెట్టివేయాలొ మనిషి తెలుసుకొవాలి. ఇదే వివేకం. ఈ వివేకముంటే మనిషి మనిషిగా మనగలుగుతాడు, మన్ననా పొందగలుగుతాడు. ఆ విడనాడవల్సినవేమిటొ వినండి.

ఆలస్యం త్యక్తవ్యం

లౌల్యం లోభః పరాపవాదశ్చ

అస్ధానేషు చ కోపః

తధాతిమానశ్చ పురుషేణ


సొమరితనం, చాపల్యం, దురాశ, పరనింద, అనువుకాని కొపం, దురహంకారం ఈ ఆరింటినీ మనిషి వదులుకోవాలి.
మనిషికి వైయక్తికంగానూ, సామజికంగానూ కొన్ని కర్తవ్యాలున్నాయి. అల్లాగే భౌతికంగానూ, పారమార్ధికంగానూ కొన్నివిధులున్నాయి. ఏ రకంగా చూసినా కొన్ని కృత్యాలున్నాయి, కొన్ని అకృత్యాలున్నాయి. ఇవన్నీ ఎరిగి సకల విధాలకర్తవ్యాలు నిర్వహించి అకృత్యాలు విసర్జించినవాడే కృతకృత్యుడౌతాడు. వాని మానవజన్మ చరితార్ధమౌతుంది.
ఎందులొ ప్రవర్తించాలన్నా త్యాజాలు ఉంటాయి. కొన్ని ఉపాదేయాలూ వుంటాయి. ముందు త్యాజాలు తెలుసుకోవాలి. వాటిని విడిచి పెట్టాలి. అప్పుడు ఉపాదేయాలవైపు మనసు అనుకూలంగా ప్రసరిస్తుంది. వాటిని స్వీకరిస్తుంది.
అంచేత ఏ దృష్టితో కానీ మనిషి వదులుకు తీరాల్సినవి ఆరున్నాయి. వాటిని తెలుసుకొని వదులుకొనే ప్రయత్నం చేయండి అంటున్నాడు నీతికారుడు.
వాటిలొ మొదటిది ఆలస్యం
తెలుగువారి ఆలస్యంకాదు. సంస్కృతం ఈ ఆలస్యం. ఆలస్యం అంటే సోమరితనం. ఇది కనపబడకుండా చాపకింద నీరులా మనిషిని ఎదగకుండా లోతులకు తొక్కేస్తుంది. ఈ సొమరితనం మనిషికి లభించిన మహత్తరమైన కాలాన్ని కబళిస్తుంది. ప్రతీదీ "తరువాత" "తరువాత" అనిపింప చేస్తుంది. "తరువాత" అన్నాడంటే "ఇహ సరి" అన్నమాటే.
పశ్చాచ్ఛబ్దొ నాస్తి పర్యాయః అని సంస్కృతంలొ ఓ ఆభాణకం వుంది. ఈ సోమరితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. కర్తవ్యం పట్ల ఉదాసీనుణ్ణి చేస్తుంది. దాంతొ కర్తవ్యం కాస్తా కాలదొషం పట్టిపోయి కాలగర్భంలొ కలసిపోతుంది. చెయ్యాల్సినవి చెయ్యక జీవితమంతా వ్యర్ధంగా గడిపేసి ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన మానవ జన్మను సదుపయోగపరచుకోలేక మనిషి భ్రష్టుపట్టిపోతాడు. అంచేత, 'రేపన్నది నేడు, నేడన్నది ఇప్పుడు' అన్నట్లు మనిషి వుండాలంటే ఆలస్యాన్ని దవ్వులకు తొలాలి.
రెండొది లౌల్యం
అంటే చాపల్యం. మనిషికి వుండే చాపల్యం ఇంతా అంతా కాదు. ఈ చాపల్యామూ ఎన్నొ రకాలు. ప్రతి ఇంద్రియానికీ ఒక్కొ రకం చాపల్యం. సరేసరి. మనసు మరీ చపలం. ఈ చాపల్యం వల్ల భావధార్ధ్యం, ఆశయస్థైర్యం సడలిపోతాయి. లక్ష్యసాధనకు ఇది భంజకం కనుక చాపల్యాన్ని వదులుకోవాలి.
మూడోది లోభం - దురాశ
మనిషికి ఆశ ఉండవచ్చు. ఉండాలి కూడాను. చదువుకోవాలని ఆశ, సంపాదించాలని ఆశ. సత్కృతులాచరించాలని ఆశ, ఇల్లా ఎన్ని ఆశలైనా ఉండొచ్చు. తప్పు కాదు. కాని, దురాశమట్టుకు కూడదు. అత్యాశకంటేనూ చెడ్డది ఈ దురాశ.
ఎత్తులకు ఎదగాలనుకోవడం ఆశ.
అందరాని ఎత్తులకు ఎదగాలను కోవడం అత్యాశ.
అందరాని ఎత్తులకు ఎగరాలను కోవడం దురాశ.
ఇది మనిషిని లోతులను పాతేస్తుంది. దురాశ దుఃఖానికి చేటు కదా! అంచేత దీన్ని వదులు కోవాలి.
తరువాతది పరనింద
కొందరికి ఒరులను నిందించడమే జీవితాశయం. లేచింది మొదలు పడుకునే వరకు ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవడమే వీరిపని. ఇది మంచిదికాదు. చెదలు కొరికినట్లు లొపల్లొపల ఇది వీణ్ణి తినేస్తుంది. పరనింద వల్ల వీడికొచ్చేది ఏమీ లేదు. మనస్సు అపమార్గంలోనే నడవడానికి అలవాటు పడి పోతుంది. కడకు వీడి బతుకు పెడ తొవనే పడుతుంది. ఈ స్వభావమువల్ల వీడు తన నాశాన్ని తానే తెచ్చుకున్న వాడౌతాడు. కనుక దీన్ని వదులు కోవాలి.
అస్థానకోపం ఐదోది
అనువుకాని వేళ కొపం పనికి రాదు. అనువుకాని వ్యక్తులపై కోపం పనికిరాదు. కోపానికి సమయా సమయాలుంటాయి. తప్పుచేసెడు-కొపం వచ్చింది. ఇక్కట్టుల్లొ ఉన్నాడు, అక్కడ అప్పుడు కొపం చూపరాదు.
ఎవరో ఒకపెద్దాయన మీద పట్టరాని కోపం వచ్చింది. ప్రయొజనం? పేదవాడి కోపం పెదవికిచేటు. వీడు పేద, అన్ని రకాలుగాను కొపం వచ్చింది. కాని, అవతల ఆ కోపం ప్రదర్శించే వీలులేదు. చోటుకాదు. కాని, కొపం ఉండనీయటం లేదు. శివజటాజూటంలొ సుడులు తిరుగు తున్న వియద్గంగలా ఎగిసి ఎగిసి పడుతుంది. దాన్ని ఎంత సేపు బిగపడతావు? నీకు లొంగి ఎంతసేపు పడి ఉంటుంది? నీ పెదవిని కాటువేస్తుంది. గాటు చేస్తుంది. సరి దాని పని. ఏమొరిగింది నీకు? ఆ కొపమెందుకు నీకు? అంచేత అనువుకాని కొపం పనికి రాదు. దాన్ని వదిలెయ్.
చివరిది దురహంకారం
అహంకారమే చెడ్డదంటారు. తనమీద అతివిశ్వాసం అహంకారం, తనమీద అతివిశ్వాసంతొపాటు అవలివారిపై ఎల్లిదపు చూపు దురహంకారం. నువ్వు చెయ్యగలననుకుంటే చేసుకో. కాని, ఆ అనుకోవడంలొ అవతలి వారిని కించ పరచకూడదు. ఇది సుతరామూ మంచిదికాదు.ఏం? వాడు మట్టుకు చేయ్యలేడా? నేను చెయ్యగల ననుకో, ఎదిరి చెయ్యగలడా లేడా అన్న పరామర్శ నువ్వు పెట్టుకోకు. అది నీకు కానిది.
ఇట్లా ఈ ఆరూ మనిషిని ఎత్తుల నుండి లోతుల పడవేసేవి కనుక బుద్దిమంతుడు తప్పక వీటిని వదులుకోవాలి.